కూటమి రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తాటాకు చప్పుళ్లకు తాను భయపడే వాడిని కాదని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భయపడే ప్రసక్తేలేదన్నారు. ఐదేళ్ల తర్వాత వైఎస్ఆర్సీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తోక ఆడించే వారి తోకలను తాము వచ్చాక కత్తిరిస్తామని హెచ్చరించారు. ‘నా ప్రతిష్టను దెబ్బతీసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారు. ఆమెతో నాకు సంబంధం అంటగట్టారు. ఎలాంటి ఆధారాలు లేని కథనాలు ప్రసారం చేశారు. అసత్య కథనాలు ప్రసారం చేసినవారితో క్షమాపణలు చెప్పిస్తా. చిన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఎదిగాను. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు వసూల్ చేసే వ్యక్తిని కాదు. రాధాకృష్ణ, బీఆర్నాయుడు, వంశీకృష్ణ మాదిరి వ్యక్తిని కాదు. అన్ని హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేస్తా. మహాన్యూస్ వంశీకృష్ణను వదలను. పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతా. ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా’ అని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.