ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పటికే రూ.47 వేల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. చివరకు జగన్ సృష్టించిన సంపదను కూడా తన వారికి ఇచ్చేస్తున్నారని అన్నారు. జగన్ కొత్త పోర్టులను సృష్టిస్తే, వాటిని ప్రైవేటు పరం చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.
రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తనవారికి పంచుతున్నారు.. రాష్ట్ర విభజన సమయంలో రామాయపట్నం పోర్టు నిర్మాణం చేయాలని చట్టంలో ఉంది.. కానీ 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం రామాయపట్నం ఊసే ఎత్తలేదని పేర్ని నాని పేర్కొన్నారు. జగన్ ఆ పోర్టును రెడీ చేశారు. షిప్‌లు రావటానికి కూడా అనుమతులు వచ్చినా పట్టించుకోవడం లేదని అన్నారు. బందరు పోర్టు వైయస్సార్ కల.. ఆ కలను జగన్ సాకారం చేస్తుండగా మళ్ళీ చంద్రబాబు వచ్చి ప్రైవేటు పరం చేశారని ఆరోపించారు.