హైడ్రా కూల్చివేతలతో మనోవేదనకు గురవుతున్నామని చెబుతూ పలువురు బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని వారు భారాస నాయకులకు తమ గోడు చెప్పుకొనేందుకు ఇక్కడికి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే తమకు నిర్మాణానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఇచ్చారని ఇప్పుడు కూల్చేస్తామనడం సరికాదన్నారు. అప్పుడు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఎలాంటి సమాచారం ఉండటం లేదని అధికారులతో మాట్లాడినా కూడా స్పందన కరవైందని వాపోయారు. భారాస నేతలకు కలిసి తమ గోడును వెల్లబోసుకునేందుకు వచ్చామని తెలిపారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడితే తమ సొంత జీతాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కానీ ఇలా అక్రమంగా ఇళ్లు కూల్చేయడం సరికాదని మండిపడ్డారు. ఎప్పుడు తమ నిర్మాణాలు కూలుస్తారో అని నిద్ర లేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామన్నారు. పలువురు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు.