ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచిస్తోంది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా వాయుగుండంగా బలపడొచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ఇది తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు కదిలే అవకాశముంది. దీని ప్రభావంతో ఈ నెల 26 తర్వాత దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక, ఈ నెల 27, 28వ తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో రాయలసీమలో పలుచోట్ల, దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణశాఖ తెలిపింది.