బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. శాసన సభలో లఘు చర్చతో లాభం లేదన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత చిన్న చూపని ప్రశ్నించారు. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేమెంతుంటే మాకంత వాటా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారని గుర్తుచేశారు. దానిప్రకారం 46.3 శాతం బీసీలు, 10 శాతం బీసీ ముస్లీంలు మొత్తం కలిపి 56 శాతం జనాభా ఉందని చెప్పారు. రిజర్వేషన్లను అమలు చేయాలంటూ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కితగ్గుతున్నారని నిలదీశారు.