కూటమి కీలక నేతలు బహిరంగంగానే కార్యకర్తల సమక్షంలో గొడవకు దిగారు. ఇంతకాలం టీడీపీ-జనసేన గొడవలు మాత్రమే చూస్తున్న ఏపీ ప్రజలకు ఇవాళి కొత్త వివాదం ఆసక్తికరంగా అనిపించింది. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. బహిరంగంగా చోటు చేసుకున్న ఈ పరిణామం కెమెరా కంటికి చిక్కింది.
శనివారం బహిరంగంగానే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విష్ణు కుమార్ రాజు మధ్య వాగ్వాదం జరిగింది. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే వేలు పెడుతున్నారు. మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేది లేదు. ఫిలిం నగర్ క్లబ్ అనేది భీమిలి నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
నాకు తెలియకుండా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి ఎలా తీసుకువెళ్తారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విష్ణుకుమార్ను ప్రశ్నించారు. లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లే సమయంలో మీరు ఆరోజు అందుబాటులో లేరని, మీరు లేకపోవడంతో కలెక్టర్ ని కలిసి వినత పత్రం సమర్పించామని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ సర్దిచెప్పబోయారు. అయినా కూడా వినకుండా గంటా విష్ణుతో వాగ్వాదం కొనసాగించారు. వాహనంలో కూర్చొనో గంటా విష్ణుపై కేకలు వేయగా దానికి బయటి నుంచే విష్ణుకుమార్ కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో తోటి నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేయగా గంటా అదేం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ పరిణామం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.