రాష్ట్ర్లంలో ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిని చేర్చుకుంటూ.. కాంగ్రెస్ పార్టీ బలం పెంచుకునే పనిలో పడింది. తెలంగాణలో 8 లోక్ సభ స్థానాలు గెలిచిన జోష్ లో ఉన్న బీజేపీ ప్లాన్ ఏంటీ ? కేంద్ర మంత్రిగా, రాష్ట్ర సారథిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పుకుంటారా ? కొత్త సారథి వచ్చే వరకు బీజేపీలో ఆపరేషన్ ఆకర్ష్ లేనట్టేనా..? అసలు బీజేపీ వైపు ఎవరైన ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? చూస్తున్న వారికి వస్తోన్న అడ్డంకులేంటి? తెలంగాణ బీజేపీలో మొన్నటి దాకా కేంద్రమంత్రి పదవి ఎవరికా అనే చర్చ జరిగితే ఇప్పడు అదంతా కొత్త సారధి ఎవరా అనే దాని చుట్టు తిరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి, పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బిజీ అయ్యారు. కేంద్రమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టడమే కాకుండా కిషన్ రెడ్డికి జమ్మూకాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇంఛార్జీగా నియమించారు. దాదాపుగా 20 రోజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతల నుంచి తప్పించాలని ఇప్పటికే అధిష్టానానికి కిషన్ రెడ్డి విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి కొత్త సారథి నియామకం తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే బీజేపీ తెలంగాణ అధ్యక్ష నియామకం జరిగే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. టీబీజేపీ పగ్గాలు ఎవరికి చిక్కుతాయో అంతుచిక్కకపోవడంతో క్యాడర్లో స్తబ్ధత కనిపిస్తోంది. దానికి తోడుగా పార్టీలో పాత, కొత్త వివాదం కొనసాగుతోంది. పాత నేతలకే పార్టీ బాధ్యతలు అప్పగించాలని కొందరు డిమాండ్ చేస్తుండగా, కండువా కప్పుకున్న రోజు నుంచే పార్టీ కార్యకర్త అనే విషయాన్ని విస్మరించవద్దని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
బీజేపీ వైపు ఎమ్మెల్యేలు చూస్తున్నారా..? కషాయదళంలో చేరేవారికి అడ్డంకులేంటి ?
