గ్రామ దేవతలు అయిన సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బేగంపేట కట్టమైసమ్మ, శివారు ప్రాంతాల్లో భక్తులచే నిత్య పూజలందుకుంటున్న గండిమైసమ్మ, మైసిగండి.. ఇలా ఎందరో గ్రామ దేవతలు మమ్ము కాసే దేవతలుగా భక్తజనం దండాలు పెట్టుకుంటూ మొక్కులు తీర్చుకుంటారు. అమ్మవార్ల ఆలయాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తులు వ్యయప్రయాసలకోర్చి వస్తుంటారు. ఆ ఆలయాలు నిత్య కళ్యాణం.. పచ్చతోరణం అన్నట్లు భక్తకోటి దర్శనాలతో విలసిల్లుతున్నాయి. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం తెలంగాణ ప్రాంతమే కాదు..దేశంలోనే సుప్రసిద్ధ ఆలయం. హైదరాబాద్ నగరం ఏర్పడకముందు ఇది కుగ్రామంగా ఉండేది. రాజాశివరాజ్ బహద్దూర్ అనే సంస్థానాదీశుడి హయాంలో ఈ ప్రాంతాన్ని బహలూన్‌ఖాన్ గూడగా పిలిచేవారు. కాలక్రమేణా అది కాస్తా బల్కంపేటగా మారి ఇప్పుడు ఎల్లమ్మ అమ్మవారి ఆలయంతో ఆ గ్రామం విశ్వవ్యాప్తమైంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తుంటారు.
దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి..
