రాష్ట్ర మంత్రివర్గంలోకి మాజీ స్పీకర్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తీసుకొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తన కారులో ఎక్కించుకొని స్వయంగా ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన సీఎం… ఆయన్ను పార్టీ పెద్దలకు పరిచయం చేశారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా, స్పీకర్‌గా ఆయన అనుభవాన్ని వారికి వివరించారు. జిల్లాలో ఉన్న ఆయన పలుకుబడి పార్టీ ఉన్నతికి ఉపయోగపడుతుందని వారి దృష్టికి తెచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేని దృష్ట్యా ఆయనకు అవకాశం ఇస్తే పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని వివరించారు. దీనిపై హైకమాండ్ పెద్దలు సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. మరోవైపు జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అంశంతోపాటు మరికొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు వివరించారు.
పోచారంతో కలిసి ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌లతో సీఎం రేవంత్ భేటీ
