ఏపీలో కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. బీజేపీ అభ్యర్థుల తరపున షెడ్యూల్ ప్రకారం శనివారం ఏలూరు జిల్లా భీమవరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సి ఉంది. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా అమిత్ షా పర్యటనను రద్దు చేశారు.
కాగా ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదల కానున్నాయి . రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సమయం గడువు ముగుస్తోంది. దీంతో బీజేపీ అగ్రనేతలు సైతం రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా కూడా కూటమి అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మరోసారి అమిత్ షా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కూటమి నేతలు ప్లాన్ చేశారు. ఈ మేరకు భీమవరంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంతలో అమిత్ షా పర్యటన రద్దు కావడంతో బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.