ఇప్పుడు అందరూ గ్యాస్‌పొయ్యిమీద వంట చేస్తున్నారు కానీ… సాంప్రదాయకంగా, మన అందరి ఇళ్లలో కట్టెలపొయ్య మీదనే వండేవాళ్లు. అయితే నేడు వంట పద్ధతుల్లో పూర్తి మార్పు వచ్చింది. చాలా మంది ప్రజలు గ్యాస్, ఎలక్ట్రిక్ స్టవ్‌లు, ఓవెన్‌లు మరియు ఎయిర్ ఫ్రైయర్‌ల వంటి ఉపకరణాలపై ఆధారపడతారు. గ్యాస్ రాకతో మన దేశంలో కట్టెల వాడకం తగ్గింది. కానీ నేటికీ కట్టెల పొయ్యిలను వాడే వారు చాలా మంది ఉన్నారు. కట్టెల పొయ్యి మీద వండితే ఆ వంట రుచిగా ఉంటుంది అని చాలా మంది అంటారు. అయితే కట్టెల పొయ్యిలో వంట చేయడం అంత మంచిది కాదని తాజా అధ్యయనంలో తేలింది.
మండిలోని ఐఐటీ పరిశోధకుల నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. కట్టెల పొయ్యిలో వంట చేయడం అన్ని సందర్భాల్లోనూ ప్రమాదం కాదు. ఇంటిలోపల కట్టెల పొయ్యిలో వంట చేయడం ఆరోగ్యానికి సవాల్ అని అభిప్రాయపడుతున్నారు. ఇంట్లో కట్టెల పొయ్యిలో వంట చేయడం వల్ల వచ్చే పొగను మనం క్రమం తప్పకుండా పీల్చుకుంటే, అది మనకు ఊపిరితిత్తుల వ్యాధులు లేదా ‘క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్’ (COPD) వ్యాధితో సహా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని అధ్యయనం వివరిస్తుంది.