రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు బీజేపీతో జతకట్టడం సరికాదని సీపీఎం నేత బీవీ రాఘవులు పేర్కొన్నారు. బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి అని.. వాళ్లతో చేరినవాళ్లు దెబ్బతింటారని ఆయన అన్నారు. ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్‌లు ఇదే విధంగా దెబ్బతిన్నాయన్నారు. ఇప్పుడైనా టీడీపీ, జనసేన పార్టీలు మేలుకోవాలన్నారు. బీజేపీతో స్నేహం చేసిన ప్రాంతీయ పార్టీల పరిస్థితిని ఎలా ఉందో చూస్తున్నామన్నారు. మహారాష్ట్రలో శివసేనను, శరత్ పవార్ నేతృతంలోని ఎన్సీపీని ఏ విధంగా చీల్చారో అందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదన్న ఆయన.. శ్రీకాకుళంలోని జంఝావతి ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. ఒడిశాలో ఉన్న వివాదాలను కూడా గత ప్రభుత్వం పరిష్కరించలేకపోయిందన్నారు. ఇప్పుడు అక్కడ బీజేపీ ప్రభుత్వమే ఉందని.. ఏపీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉందని.. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలన్నారు. పోలవరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని కాంట్రాక్టర్‌ను జగన్ మార్చేశారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు పనులు కూడా పూర్తి కాలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పురోగతిలో ఆలస్యాన్ని గుర్తించి వాటికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
అమరావతిలో రాజధాని మూడేళ్లు పూర్తి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారని.. రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశారని ఆరోపించారు. గతంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చంద్రబాబు చర్యలు తీసుకోవాలన్నారు. మళ్లీ సింగపూర్.. మలేషియా పేర్లు ఎత్తకుండా చంద్రబాబు పనులు చేయాలని సూచించారు. పరిపాలనకు అవసరమైన ముఖ్యమైన హంగులను కల్పించాలన్నారు. రాజధానిని ఎవరూ మార్చేందుకు వీలు లేకుండా పకడ్బందీ చట్టాన్ని తీసుకురావాలని సీపీఎం నేత బీవీ రాఘవులు ప్రభుత్వానికి సూచనలు చేశారు.