రాష్ట్రంలో గుండాయిజం పెరిగిపోయింది.. అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 2 వేలకు పైగా అత్యాచారాలు జరిగాయని హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ భవన్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయి. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదు.
నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలి. ఇక నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఇంటి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఈ దాడికి బాధ్యత వహించాలి. రాత్రిపూట ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేసిండ్రు. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి. పోలీసులు పట్టించుకోవడం లేదు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.