ఏపీలో ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శకుని పాచికలు వేసినట్టుగా టీడీపీ, జనసేన, బీజేపీకి కావాల్సినట్టుగా పాచికలు పడ్డాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి పాచికలు వేసినట్టుగా ఉందని.. ఈవీఎంలపై తమ పార్టీ అభిప్రాయం అదేనన్నారు. మంచి చేశాం అయినా ఎందుకు ఓడిపోయామో అర్థం కాలేదని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా కార్యకర్తలకు అండగా ఉండాలని జగన్ చెప్పారని.. ఆమేరకు ముందకు వెళ్తామని కొడాలి నాని తెలిపారు. 1.30 కోట్ల ప్రజలు ఓట్లు వేశారని.. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇద్దామని జగన్ చెప్పినట్లు కొడాలి నాని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చెయ్యడని.. ప్రతీ మహిళకు 1500 ఎప్పుడు ఇస్తారు. 20 లక్షల నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎప్పుడ్నుంచి ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు పక్క దారి పట్టించడానికి పోలవరం, అమరావతి అంటూ చంద్రబాబు తిరుగుతున్నాడని కొడాలి నాని ఆరోపించారు. తమను ఎవరు టార్గెట్ చేసినా భయపడేది లేదన్నారు. కనీసం రివ్యూ చెయ్యకుండా వైఎస్ జగన్‌కు సెక్యూరిటీ తీయడం దారుణమన్నారు. రుషికొండలోని భవనలు.. జగన్ నివాసాలు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రభుత్వ భవనాల్లో ఉండాల్సిన కర్మ జగన్‌కు లేదని నాని చెప్పుకొచ్చారు.
శకుని పాచికల మాదిరిగా ఎన్నికల ఫలితాలు.. కొడాలి నాని సంచలన కామెంట్స్..
