పెద్దపల్లి జిల్లా ఓడేడు మండలం మానేరు వంతెననిర్మాణంలో మరోసారి నాణ్యతా లోపం బయటపడింది. గత తొమ్మిదేళ్లుగా వంతెన పనులు చాలా ఆలస్యంగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న (మంగళవారం) భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా… పెద్దపల్లి జిల్లా ఓడేడు మండలం మానేరు నదిపై గత ప్రభుత్వం భారీ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకల కోసం ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2016లో రూ.47 కోట్ల అంచనాతో వంతెన పనులను ప్రారంభమయ్యాయి. అయితే నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలతో పనులలో జాప్యం నెలకొంది. నిర్మాణం చేపట్టి తొమ్మిదేళ్లు కావొస్తున్నప్పటికీ ఇంకా పూర్తి కాని పరిస్థితి. ఇంతలోనే వరదలు, ఈదరు గాలులతో నిర్మాణం కోసం ఉపయోగించే సామాగ్రి కూడా దెబ్బతినడంతో పాటు, గుత్తేదారులు మారడంతో వంతెన నిర్మాణం మరింత ఆలస్యమవుతోంది. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌లో వీచిన ఈదురు గాలులకు మూడు గడ్డర్లు కూలిపోయిన విషయం తెలిసిందే.
మానేరు వంతెన నిర్మాణంలో మరోసారి బయటపడ్డ నాణ్యతా లోపం..
