ఇటీవల కురిసిన భారీ వర్షాలు రాష్ట్రాన్ని వరదలతో ముంచేత్తాయి. ఈ భారీ వరదల సమయంలో నాలుగు బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి. బోట్లు ఢీకొని మూడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభించింది. 50 టన్నుల బరువు ఎత్తే కెపాసిటీ ఉన్న 2 క్రేన్లతో పనులు చేపట్టింది. ఈ నెల 1వ తేదీన ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 4 పడవలు 67, 68, 69 గేట్ల వద్ద చిక్కుకోగా, అవి ఢీకొని బ్యారేజ్ కౌంటర్ వెయిట్లు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 2,09,937 క్యూసెక్కుల వరద దిగువకు ప్రవహిస్తుండగా, 68, 69 గేట్లను క్లోజ్ చేసి పనులు జరిపిస్తున్నారు.
బోట్ల తొలగింపు ప్రక్రియను జలవనరుల శాఖ ప్రారంభం..
