జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం నుంచి భద్రతబలగాలను రప్పించారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 24వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమయంలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించకూడదని చెప్పారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27వ తేదీ సాయంత్రం 4.50 గంటలకు వైఎస్ జగన్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు తిరుమలకు బయల్దేరతారు. రాత్రి 7 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. రాత్రి అక్కడే గెస్ట్ హౌస్‌లో బస చేసి మరుసటి రోజు ఉదయం 10.30 గంటలకు తిరుమల ఆలయానికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11.30 గంటలకు ఆలయం నుంచి గెస్ట్ హౌస్‌కు బయల్దేరతారు. 11.50 గంటలకు తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయానికి వెళ్తారు. 1.30 గంటలకు రేణిగుంట నుంచి బెంగళూరులోని తన నివాసానికి చేరుకుంటారు.