ఏపీలో వరదలు భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్‌ని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజ్ వివరాలను వెల్లడించారు. ఇటీవల విజయవాడలో వరదలకు పూర్తిగా నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.25 వేలు, మొదటి అంతస్తులో ఉండేవారికి రూ.10 వేలు, ఇళ్లల్లో నీళ్లు వచ్చిన బాధితులకు రూ. 10 వేలు, చిరువ్యాపారులకు రూ. 25 వేలు అందజేస్తామని ఆయన ప్రకటించారు. చేనేత కార్మికులకు రూ. 15 వేలు, మగ్గం కోల్పోయిన వారికి రూ. 25 వేలు, ఫిషింగ్ బోట్లకు నెట్ దెబ్బతిని పాక్షికంగా ధ్వంసమైతే రూ. 9 వేలు, పూర్తిగా ధ్వంసమైతే రూ. 20 వేలు అందజేస్తామని వివరించారు.
బైకుల బీమా, మరమ్మతులకు సంబంధించి 9వేలకు పైగా క్లెయిమ్‌లు వచ్చాయని, ద్విచక్రవాహనదారులు రూ. 71 కోట్ల మేర క్లెయిమ్ చేయగా రూ. 6 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. మరో 6వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, త్రిచక్రవాహనదారులకు రూ. 10 వేలు ఆర్థికసాయం చేస్తామన్నారు. రూ. 40 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల టర్నోవర్ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. లక్ష, రూ. 1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు రూ. 1.5 లక్షలు సాయం చేస్తామని చంద్రబాబు వివరించారు.