తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. గత నెల 10న తిరుపతిలోని ఓ హోటల్ లో తనపై ఎమ్మెల్యే లైంగిక దాడి చేసినట్టు ఆమె ఆరోపించారు. భర్తతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కామాంధుడని, మహిళ కనిపిస్తే చాలు లైంగికంగా వాడుకోవాలని చూస్తారని ఆమె ఆరోపించడం గమనార్హం. తనను చాలా రోజులుగా ఎమ్మెల్యే లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె చెప్పారు. వేధింపులు తట్టుకోలేక తిరుపతిలోని లాడ్జీకి వెళ్లి, తనపై ఎమ్మెల్యే లైంగిక దాడి చేశాడని ఆమె ఆరోపించారు.
ఇందుకు సాక్ష్యంగా లైంగిక దాడికి సంబంధించి వీడియోని కూడా ఆమె విడుదల చేయడం గమనార్హం. పదేపదే తనకు ఆదిమూలం ఫోన్ చేసి, లైంగిక వాంఛలు తీర్చాలని వేధిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆమె డిమాండ్ చేశారు. టీడీపీని, చంద్రబాబును ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో తాను మీడియా ముందుకు రాలేదని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబే తమకు దిక్కు అని ఆయన అన్నారు. బాధితురాలి భర్త మీడియాతో మాట్లాడుతూ కోనేటి ఆదిమూలం నుంచి తమకు ప్రాణహాని వుందని అన్నారు. రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఆదిమూలం వల్ల ఎంతో మంది బాధపడుతున్నట్టు ఆయన అన్నారు.