దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు వంటి పచ్చి మోసగాడు మరొకరు కనిపించరు అని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. నమ్మక ద్రోహం, మోసాలతోనే రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు తుది వరకు అదే పంథాను కొనసాగిస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిసారీ ప్రజలను నట్టేట ముంచడం అలవాటుగా మార్చుకున్నాడని ధ్వజమెత్తారు. తాజాగా జరిగిన కేబినెట్ లో అయినా సూపర్ సిక్స్ అమలుపై కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశించినా, మళ్లీ ప్రజలకు మొండిచేయి చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు చర్యలు తీసుకుంటారని ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు 12 కేబినెట్ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వపరంగా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో సూపర్ సిక్స్ కు సంబంధించినవి లేవు. తాజాగా గురువారం కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అయినా కూటమి పార్టీలు ఇచ్చిన హామీలపై ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ప్రజలు ఎదురుచూశారు. మళ్ళీ, మళ్ళీ మోసం చేయడమే అలవాటుగా చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు కూడా ప్రజలను నిరాశలోనే ముంచేశాడు.