ఏపీ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలో శనివారం నుంచి భూముల రిజిస్ట్రేషన్ ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భూముల అమ్మకాలు, విక్రయాలు ఊపందుకున్నాయి. ఈ మేరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజలు గురువారమే రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తారు. అర్ధరాత్రి వరకూ ఉండి మరీ భూములు, ఇళ్లు, స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
అయితే ఈ రద్దీ శుక్రవారం కూడా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచే రిజిస్ట్రేషన్ల కార్యాలయం వద్ద వ్యాపారులు బారులు తీరారు. ఈ అర్ధరాత్రి వరకూ పాత ఛార్జీలే కొనసాగనుండటంతో భారీగా రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల వద్ద కూడా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వానికి అత్యధికంగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ప్రస్తుతం భూముల క్రయ, విక్రయాలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. సాధారణ రోజుల్లో 10 నుంచి 50 వరకూ రిజిస్ట్రేషన్లు జరిగేవని, గత వారంగా 100 నుంచి 150 వరకూ జరగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.