ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం, పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర పోలీసులు భద్రత కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తాడేపల్లి జగన్ నివాసం, వైసీపీ కార్యాలయం దగ్గర పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. జగన్ నివాసం పక్కనున్న వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో ఈ నెల 5న గడ్డి తగలబడి మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్నారు.
ఈ మేరకు దర్యాప్తులో భాగంగా వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను ఇవ్వాలని స్థానిక పోలీసులు ఆ కార్యాలయ సిబ్బందిని కోరారు. కానీ వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో జగన్ నివాసం దగ్గర భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు నిఘాను పెంచేందుకు వీటిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. వీటిని తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లోని మానిటర్‌కు కనెక్ట్ చేశారు. వైసీపీ కార్యాలయం ఎదురుగా ఉన్న గార్డెన్‌లో గడ్డి తగలబడి మంటలు చెలరేగిన ఘటనపై విచారణ కూడా జరుగుతోంది.