రాష్ట్రంలో స్కాంలన్నింటికీ పరాకాష్ట నేడు అమరావతిలో జరుగుతున్న దోపిడీ అని జగన్ ఆరోపించారు. ఐకానికి టవర్ల పేరుతో ఐదు భవనాల కోసం 2018లో టెండర్లు పిలిస్తే వచ్చిన రేటు 2271 కోట్లు అని జగన్ తెలిపారు. ఇప్పుడు మిగిలిపోయిన పనులకు నిర్మాణం వ్యయం 4668 కోట్లన్నారు. అంటే 2018తో పోలిస్తే 2418 కోట్లు పెంచేశారన్నారు. ఇది 105 శాతం అధికం అన్నారు. ఇందులో చదరపు అడుగుకు రూ.8931 అన్నారు. ఇదే ప్రభుత్వంలో ఇతర పనుల కోసం చదరపు అడుగుకు అన్ని పన్నులు కలిపినా రూ.2500 ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడున్న తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం అంతా కలిపి ఆరు బ్లాకుల్లో 6 లక్షల చదరపు అడుగుల్లో ఉందన్నారు. ఇది ఉండగానే కొత్త సచివాలయం, అసెంబ్లీ, హెచ్వోడీ ఆఫీసుల కోసం 53 లక్షల 57 వేల 389 చదరపు అడుగుల్లో నిర్మాణాలు చేస్తున్నారన్నారు.
ఈ మూడు భవనాల్లో 12 వేల మంది ఉద్యోగులు మాత్రమేనన్నారు. ఉద్యోగుల సంఖ్య పెరగనప్పుడు ఇంత విశాల భవనాలు ఎందుకన్నారు. అమరావతి శాశ్వతం కొనసాగాలని, నిరంతరం పనులు జరుగుతూ ఉండాలని, అందుకే ఇంత పెద్ద భవనాలు కడుతున్నారన్నారు. హైదరాబాద్ లో కేసీఆర్ తెలంగాణ సచివాలయాన్ని 8.58 లక్షల చదరపు అడుగుల్లో 616 కోట్ల ఖర్చుతో కట్టారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం 53 లక్షల చదరపు అడుగుల్లో కడుతున్నారన్నారు. ఇప్పటికే కట్టిన అసెంబ్లీ, సచివాలయానికి అయిన 600కోట్ల ఖర్చును గంగపాలు చేస్తున్నారన్నారు. కొత్త భవనాలు కట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు ఇలాంటి నిర్మాణాలు చేసి డబ్పులు ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు.