ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఐదేళ్ల గడువుతో ఆయనకు పాస్‌పోర్టు మంజూరు చేయాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. 2024 సెప్టెంబరు 20న జగన్ పాస్‌పోర్టు గడువు ముగిసింది. దీంతో తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టుకు ఎన్వోసీ ఇచ్చేలా ఆదేశించాలన్న ఆయన విజ్ఞప్తిని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టును జగన్ ఆశ్రయించగా తాజా తీర్పు వెలువడింది. పాస్‌పోర్ట్ కోసం ప్రత్యక్షంగా జగన్ హాజరుకావాలని హైకోర్టు సూచించింది. విజయవాడ ప్రత్యేక కోర్టు జగన్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ పేర్కొన్న కారణాలు చెల్లవని హైకోర్టు పేర్కొంది. కోర్టు తీర్పుతో జగన్ యూరప్ పర్యటనకు లైన్ క్లియర్ అయింది. 2025 జనవరి 16వ తేదీన యూకేలో జరగనున్న కుమార్తె డిగ్రీ పట్టా ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు.