తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మే నెల మొదటి వారంలోనే 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెల్లవారుజామున 8 గంటల నుంచి ఉష్ణోగ్రతలు దంచి కొడుతుండటంతో ప్రజలు ఇంటినుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వడగాలులు ఒకవైపు.. తీవ్ర ఉక్కపోత మరోవైపు ప్రజలను అల్లాడిస్తుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు చల్లని వార్తను అందించింది. ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. వచ్చే మూడు రోజులు పాటు చిత్తూరు, విశాఖ, శ్రీకాకుళం, పల్నాడు, అనకాపల్లి, విజయనగరం, మన్యం జిల్లాలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.