ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన ఎమ్మెల్సీ నాగాబాబు రెండో రోజు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ రోడ్లను నిర్మించగా వాటిని నాగబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎమ్మెల్సీ నాగబాబుకు ఊహించని విధంగా షాక్ ఇచ్చారు. కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమానికి వెళ్లగా నాగబాబును చుట్టుముట్టిన టీడీపీ నేతలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు.
దీంతో నాగబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తలకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అయితే అక్కడే ఉన్న సీనియర్ జనసేన, టీడీపీ నేతలు వివాదం ముదరకుండా తమ కార్యకర్తలను సముదాయించుకున్నారు. ఇటీవల ఓ సమావేశంలో నాగబాబు పవన్ కల్యాణ్ విజయంపై మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కల్యాణ్ జనసేన కార్యకర్తలు, ప్రజల ఓట్లతోనే గెలిచారని కొంతమంది క్రెడిట్ కోసం పాకుతున్నారని టీడీపీ నేత వర్మను ఉద్దేశించి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో నాటి నుంచి పిఠాపురం లో జనసేన, టీడీపీ నేతల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా నాగబాబు పిఠాపురం పర్యటనకు రావడంతో మరోసారి ఈ వివాదం తెరమీదకు వచ్చింది.