ప్రజలు అధికారం ఇచ్చింది సొంత పగలు తీర్చుకోవడానికి కాదని జగన్ ను చూసిన తర్వాతైనా అందరూ నేర్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దిల్లీలో మీడియాతో ముచ్చటించిన రేవంత్ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జనం ఎన్నో ఆశలతో వైకాపాకు 151 సీట్లు ఇస్తే జగన్ చేసిన నిర్వాకం వల్లే ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేశారన్నారు. అదే సమయంలో 23 సీట్లే వచ్చినా చంద్రబాబు కోర్ రాజకీయాలు వదలకుండా పోరాడటం వల్లే చారిత్రక విజయం సాధించారన్నారు. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ ఎంతన్న రేవంత్ అయినా వైకాపా వాళ్లు తిట్టే తిట్లు, కామెంట్లను తట్టుకొని ఐదేళ్లపాటు అలుపెరగని పోరాటం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేస్తే కనీసం పదిశాతం ఓట్లు దక్కించుకునేదని అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో తెలియదన్నారు. ఏపీలో చంద్రబాబు బాధ్యతలు చేపట్టినప్పటికీ..తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీపడబోమన్నారు. ఈ ఉద్యోగం కోసమే ఆయన్ని వదిలి వచ్చానని ఇప్పుడు చంద్రబాబు కోసం ఆ ఉద్యోగాన్నే వదులుకుంటానా అని ప్రశ్నించారు . హైదరాబాద్ లో జగన్ ఇంటి ముందు కూల్చివేతల విషయం తనకు చెప్పకుండానే చేశారని…కానీ చంద్రబాబు చెబితేనే తాను ఆ పని చేయించానని ప్రచారం చేశారన్నారు. జగన్ ఇంటి ముందు ఏమున్నాయో…. చూసేంత ఖాళీగా చంద్రబాబు ఉంటారని తాను అనుకోవడం లేదన్నారు. అయినా జగన్ చచ్చిన పాముతో సమానమని…ఆయన ఇంటి ముందు గదులు కూలగొట్టాలని చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకు లేదన్నారు. అమరావతి హైదరాబాద్ కు పోటీయే కాదన్న తెలంగాణ సీఎం… హైదరాబాద్ ను వదిలి అమరావతికి వెళ్లి ఎవరూ పెట్టుబడులు పెడతారని తాము అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అమరావతిలో పెట్టుబడులు పెడితే లాభపడతామని భావిస్తే….మేం తాడుతో కట్టేసినా ఎవరూ ఆగరని రేవంత్ రెడ్డి చెప్పారు.
ప్రజలు అధికారం ఇచ్చింది సొంత పగలు తీర్చుకోవడానికి కాదు..
