ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. ఈ సారి ఎన్నికల్లో గతంకంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లుకూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సుమారు 5లక్షల40వేల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఇదిలాఉంటే.. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఎన్నికల కమిషన్ కీలక సూచనలు చేసింది. ఈసీ మార్గదర్శకాలను అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు సీఈవో ముకేశ్ కుమార్ మీనా పంపించారు.
ఎన్నికల సంఘం సూచనలు ఇవే..
- గెజిటెడ్ అధికారి స్టాంప్ వేయలేదనే కారణంతో పోస్టల్ బ్యాలెట్ ను చెల్లని ఓటుగా పరిగణించవద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
- ఫాం 13Aపై ఆర్వో సంతకం సహా పూర్తి వివరాలు నింపిఉంటే స్టాంప్ లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.
- పోస్టల్ బ్యాలెట్ పేపర్ పై ఆర్వో సంతకం సహా బ్యాలెట్ ను ధృవీకరించేదుకు రిజిస్టర్ తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది.
- పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం-సీ పై ఓటరు సంతకం లేదని బ్యాలెట్ ను తిరస్కరించ రాదని వెల్లడించింది.
- ఫాం 13Aలో ఓటర్ సంతకం లేకపోయినా, గెజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా బ్యాలెట్ తిరస్కరించరాదు.
- పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా, ఆ ఓటు తిరస్కరణ కు గురి అవుతుందని ఈసీ స్పష్టం చేసింది.