కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చారు. గత జగన్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయిందని ప్రచారం చేశారు. కలెక్టర్ కార్యాలయాలు కూడా తనఖా పెట్టి అప్పులు చేస్తున్నారని నానా యాగీ చేశారు. ఇప్పుడు, చంద్రబాబును జాకీలు పెట్టి లేపారు. ప్రపంచ ఆర్థిక వేత్తలకు కూడా చంద్రబాబు పాఠాలు చెబుతారని చెప్పారు. చంద్రబాబును సీఎంని చేస్తే ఆయన సంపద సృష్టిస్తారు. జగన్ చేసిన అప్పులు కూడా తీరుస్తారని డబ్బాలు కొట్టారు. ఆయనకు వత్తాసు పలికే పవన్ మాటలు నమ్మి ప్రజలు ఓటేశారు. ఇప్పుడు తలకు మించిన అప్పులు చేస్తున్నారు అని పేర్ని నాని తెలిపారు.
కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా అప్పులు చేస్తున్నారని వైసీపీ నేత పేర్నినాని తెలిపారు. మంత్రిగా ఎవరున్నా పద్దతి ప్రకారం అప్పులు తీసుకుంటారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత బరితెగించి అప్పులు చేయటం లేదు. బిల్డపు బాబాయ్ చంద్రబాబు, చిన్న బిల్డప్ బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎన్నో కథలు చెప్పారు. అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తానని చెప్తారు. రాష్ట్రం అంటే అమరావతి మాత్రమే అన్నట్లుగా లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నారు. తగుదునమ్మా అన్నట్లుగా మరో 44 వేల ఎకరాలు భూములు తీసుకుంటున్నారు. అసలు రాష్ట్రాన్ని ఏం చేద్దామనుకుంటున్నారు అని ప్రశ్నించారు. మోసపూరిత మాటలతో ఓట్లు వేయించుకుని మీ సంపద పెంచుకుంటున్నారు. ఇవాళ చూస్తే చంద్రబాబు ఆస్తులు పెరిగాయి. స్పెషల్ ఫ్లైట్ తిరుగుతున్నారు. డిప్యూటీ సీఎం విమానాలు, హెలిక్రాఫ్టర్లలో తిరుగుతున్నారంటూ పేర్నినాని మండిపడ్డారు.