దావోస్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. వాళ్లు వెరీ రిచ్ మేం వెరీ పూర్ అంటూ మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమ రాష్ట్రాల్లో పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తున్నారు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ వెళ్లి వివిధ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సమావేశమై తమ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు తమ ప్రభుత్వం కల్పిస్తున్న మౌలికసదుపాయాలు వివరిస్తూ పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతున్నారు. అయితే, దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ముగ్గురు సీఎంలు పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.