ఏపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించిన ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మరో మూడు రోజుల్లో కురుక్షేత్రం జరగనుంది. ఐదేళ్ల భవిష్యత్ ను, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగిసిపోతాయని, జగన్‌కు ఓటు వేస్తే ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయన్నారు.
చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తలకాయ పెట్టడమేనని జగన్ ఎద్దేవా చేశారు. సాధ్యం కాని హామీలను గుప్పించి మోసం చేస్తున్నారని, ప్రతిఒక్కరూ ఈ విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజల దీవెనలతో తన 59 నెలల పాలనలో గతంలో ఎన్నడూ చూడని మార్పులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. రూ. 2.70 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి, నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు అమలు చేసిన ప్రభుత్వం తమదేనని అన్నారు.