హిందూ మతంలో ఏకాదశి తిథికి విశిష్ట స్థానం ఉంది. వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలోని పదకొండవ రోజున ఏకాదశి తిధిని మోహిని ఏకాదశిగా జరుపుకోనున్నారు. ఈ రోజున మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు మోహిని ఏకాదశి రోజున చేసే దానధర్మాలకు విశిష్టస్థానం ఉంది. మోహినీ ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలతో విష్ణువు అనుగ్రహం లభిస్తుందని.. భక్తులందరికీ పుణ్య ఫలితాలు లభిస్తాయని కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.
ఎవరైనా మోహినీ ఏకాదశి వ్రతాన్ని చేయవచ్చు. అంతేకాదు ఆ రోజున శక్తి మేరకు దానం చేయవచ్చు. అవసరంలో ఉన్న వ్యక్తికి విరాళం ఇవ్వవచ్చు. దానం చేసేటప్పుడు.. దానం చేసిన వస్తువుల స్వచ్ఛతను గుర్తుంచుకోండి. అలాగే దానధర్మాలు పుణ్యం పొందడానికే కాదు.. పేదవారికి సహాయం చేయడం కోసం అని కూడా గుర్తుంచుకోవాలి. పంచాంగం ప్రకారం ప్రజలు మోహినీ ఏకాదశి వ్రతం, పూజా విధానం, పారణ సమయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సంవత్సరం 2024లో మోహినీ ఏకాదశి ఆదివారం, మే 19న సూర్యోదయంతో ప్రారంభమై, మరుసటి రోజు మే 20న సూర్యోదయం తర్వాత ముగుస్తుంది.