ఖమ్మం వేదికగా కేసీఆర్, బండి సంజయ్‌, కిషన్ రెడ్డిలకు రేవంత్ రెడ్డి సవాల్

revath-11.jpg

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ఆయన మాట్లాడుతూ… రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న వారిని చెప్పుతో కొట్టాలని బీజేపీ నేతలు చెబుతున్నారని… కానీ వారి పార్టీ నేత దుష్యంత్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎవరిని చెప్పుతో కొట్టాలో వారు చెప్పాలని నిలదీశారు. ఇప్పుడు కిషన్ రెడ్డిని కొట్టాలా? సంజయ్‌ని కొట్టాలా? లేక అలా అన్నవాడిని కొట్టాలా? అని ప్రశ్నించారు.

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాము ఇప్పటి వరకు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని… ఈ నెల 8వ తేదీలోగా మిగిలిన బకాయిలు చెల్లించే బాధ్యత కూడా మాదే అన్నారు. మే 9వ తేదీ రోజున ఒక్క రైతుకు బకాయి ఉన్నా అమరవీరుల స్థూపం వద్ద తాను ముక్కు నేలకు రాస్తానన్నారు. ఒకవేళ అందరికీ అందితే కేసీఆర్ క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాస్తారా? అని సవాల్ చేశారు. కేంద్రంలో రెండు సంకీర్ణాలు ఉన్నాయని… కేసీఆర్ ఎందులో చేరుతారో చెప్పాలని నిలదీశారు. దేశ రాజకీయాలకు ఖమ్మం దిక్సూచి అన్నారు. కేసీఆర్ తమ కూటమిలో చేరుతానని చెప్పినా చేర్చుకునేది లేదని… ఆయన బీజేపీ సంకీర్ణంలోనే చేరుతారని జోస్యం చెప్పారు.

Share this post

scroll to top