శ్రావణమాసం ఆరంభం పండుగల కళకళ !

తెలుగుమాసాలలో ఐదోమాసం శ్రావణం. ఎంతో పవిత్రమైన మాసం సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదోది ఎంతో పవిత్రత కలిగినది శ్రావణమాసం. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు, శిష్ట రక్షకుడు అయిన మహావిష్ణువుకు ఆయన దేవేరి(భార్య) మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు.

శ్రావణమాసం ఎందుకు ప్రీతికరం అంటే విష్ణువు నక్షత్రం శ్రవణం కాబట్టి అని కొందరు పెద్దలు పేర్కొంటున్నారు. ఈ మాసంలో మంగళగౌరీ, శ్రావణ శుక్రవారం, గోకులాష్టమి తదితర పుణ్య విశేషమైన పండుగలు వస్తాయి. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో ఈ మాసం శివారాధనకు ప్రసిద్ధి. ఈ మాసంలో శివారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాలలో విశేషార్చనలు చేయడం ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి.