మాస్ట్రో మూవీ రివ్యూ

హీరో నితిన్‌ మూవీలంటేనే రొటీన్‌కి భిన్నంగా ఉంటాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా.. నితిన్‌ విభిన్న కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన మూవీ మాస్ట్రో. ఈసినిమా సెప్టెంబర్‌ 17న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ చిత్రం బాలీవుడ్‌ అంధాదున్‌ రీమేక్‌్‌గా తెరకెక్కింది. బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా నటించిన పాత్రలో నితిన్‌ నటించారు. బాలీవుడ్‌లో హిట్‌ కొట్టిన చిత్రం.. తెలుగులో దర్శకుడు మేర్లపాక గాంధీ ఎలా తెరకెక్కించారు? ప్రేక్షకులను అలరించిందో లేదో తెలుసుకుందామా?

కథ 
అరుణ్‌ (నితిన్‌) ఓ అంధుడు. తన బాల్యంలో జరిగిన ఓ ప్రమాదంలో తనకు కళ్లుపోయాయని చెప్పుకుంటూ ప్రపంచానికి అతనో అంధుడిలా కనిపిస్తాడు. అయితే వాస్తవానికి తనకి కళ్లు కనపడతాయి. తనకెంతో ఇష్టమైన పియానో వాయిస్తూ.. జీవనం సాగిస్తాడు. అయితే తన పియానో పాడైపోవడంతో.. కొత్తది కొనాలని చూస్తాడు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి ఉన్న పియానో కొనడానికి వెళతాడు. అప్పుడే రెస్టారెంట్‌ యజమాని కుమార్తె సోఫి (నభా నటేశ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. నష్టాల్లో నడుస్తున్న రెస్టారెంట్‌ కాస్తా.. అరుణ్‌ రోజూ చేసే పియానో షో కారణంగా.. మళ్లీ లాభాల్లోకి వస్తుంది. ఈ క్రమంలో సోఫీ, అరుణ్‌ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అరుణ్‌ పియానో షో చూడడానికి ఒకప్పటి సినీ హీరో మోహన్‌ (నరేష్‌) రెస్టారెంట్‌కి రోజూ వస్తాడు. అరుణ్‌ ప్రతిభను చూసి.. మోహన్‌ తన రెండో భార్య సిమన్ర్‌ (తమన్నా) వివాహ వార్షికోత్సవం సందర్భంగా అరుణ్‌ని తన ఇంటికొచ్చి పియానో వాయించమని చెబుతాడు. అరుణ్‌ పియానో వాయించడానికి మోహన్‌ ఇంటికొచ్చే సమయానికి అతను హత్యకు గురవుతాడు. ఈ హత్య చేసిందెవరు? మోహన్‌ రెండో భార్య సిమ్రన్‌కి పోలీస్‌ ఆఫీసర్‌ బాబీ (జిషు సేన్‌ గుప్త)లకునున్న సంబంధం ఏమిటి? మోహన్‌ హత్యానంతరం అరుణ్‌ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? మోహన్‌ హత్య మిస్టరీని అరుణ్‌ ఎలా కనిపెడతాడు? ఇక అరుణ్‌ సోఫీ ప్రేమ చివరికి ఏమైంది? వంటివి తెలియాలంటే.. సినిమా చూడాల్సిందే.