128 ఏళ్ల తర్వాత నిలిచిపోనున్న వెంకన్న దర్శనం

తిరుమలలో శ్రీవేంకటేశ్వస్వామి దర్శనానికి భక్తులను వారంపాటు అనుమతించకూడదని టీటీడీ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేశారు. కల్యాణోత్సవాన్ని సైతం ఏకాంతంగా జరిపించేందుకు నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చారు. నిత్య సేవల్లో భాగమైన వసంతోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ, సహస్ర కలశాభిషేకం సేవలను టీటీడీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు కూడా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో వేచి ఉండే అవసరం లేకుండా టైంస్లాట్‌ ప్రకారం నేరుగా శ్రీవారిని దర్శించుకునే ఏర్పాటు చేశారు.

అన్నప్రసాద సముదాయంలో కూడా నలుగురు భోజనం చేసే స్థలంలో ఇద్దరు మాత్రమే కూర్చుని తినేలా దూరం పెంచారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో ప్రతి 2గంటలకు ఒకసారి శుభ్రం చేయిస్తున్నారు. అలిపిరి వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. నడకమార్గాల్లో అవగాహన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా కరోనా వైరస్‌ లక్షణాలతో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక భక్తుడు తిరుమలకు చేరుకున్నాడు. 110మంది బృందంతో కలిసి శ్రీశైలం దర్శనానంతరం శ్రీవారి సన్నిధికి వచ్చాడు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆ భక్తుడిని తిరుమలలోని అశ్వని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత తిరుపతి రుయాకు తీసుకెళ్లి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఉలిక్కిపడిన టీటీడీ అధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు.

ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు విచ్చేసే భక్తులందరినీ తనిఖీ చేసే అవకాశం లేకపోవడంతో శ్రీవారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అలిపిరిలో తిరుమలకు వెళ్లేదారిని మూసేయించారు. ఇప్పటికే కొండపై ఉన్న భక్తులను దర్శనం పూర్తి చేయించి కిందకు దించే ఏర్పాట్లు చేపట్టారు. నడకదారుల్లో నుంచి కూడా భక్తులను అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు. అన్నదాన సత్రం, కల్యాణకట్టను మూసేయనున్నారు. దీంతో కొన్ని రోజులపాటు శ్రీవారి దర్శనానికి భక్తులు దూరం కాబోతున్నారు.