శాస్త్రం ప్రకారం.. శివ దర్శనం ఇలా చేసినట్లయితే సంపూర్ణ ఫలితం

శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ లింగాన్ని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. పరమేశ్వరునికి నంది అనుంగ భక్తుడు, ద్వారపాలకుడు కూడా. కాబట్టే నందికి అంతట ప్రాధ్యాన్యత. అందుకే లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. శివాలయంలో లింగాన్ని దర్శించుకునే సమయంలో మనసును భగవంతునిపై కేంద్రీకరించాలి. గర్భాలయంలో చిన్న అఖండ దీపం వెలిగిస్తారు. కేవలం శివాలయంలోనే నంది కొమ్ముల మధ్య నుంచి గర్భగుడిలోని శివలింగాన్ని చూస్తారు.

సాధారణంగా శివాలయానికి వెళ్లేటప్పుడు ప్రదక్షిణ చేసి పరివార దేవతల దర్శనం తర్వాత పరమశివున్ని దర్శించుకుంటాం. కొందరు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనమని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఏ శివాలయంలో అయినా పరమేశ్వరుడు శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల్లా విగ్రహ రూపం కాకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని రూపాన్ని మనసు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న శివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. పృష్ఠ భాగాన్ని నిమురుతు, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా కలిగి శుభకరమైన ఫలితం దక్కుతుంది.