నారప్ప మూవీ రివ్యూ

 వెంకటేష్‌ ఇప్పటివరకూ నటించని పాత్ర.. తాను ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన సినిమా నారప్ప. ఈ చిత్రం తమిళ ‘అసురన్‌’ మూవీ రీమేక్‌. ఈ చిత్రానికి నిర్మాతలుగా ఎస్‌.థాను, సురేష్‌బాబు వ్యవహరించగా.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లలో విడుదల కాకుండా ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మంగళవారం (జూలై 20)న విడుదలైంది. మరి జాతీయ అవార్డును వరించిన అసురన్‌లా.. నారప్ప ఉందా లేదా అనేది తెలుసుకుందాం…
కథ
అనంతపురం జిల్లా రామసాగరం గ్రామానికి చెందిన నారప్ప (వెంకటేశ్‌) తనకున్న మూడెకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ.. కుటుంబంతో సాధారణ జీవితం గడిపే వ్యక్తి. పక్కగ్రామం సిరిపికి చెందిన భూస్వామి అయిన పండుస్వామి… సిమెంటు ఫ్యాక్టరీని నిర్మించేందుకు నారప్పకున్న కొద్దిపాటి పొలాన్ని బలవంతంగా కొనేందుకు ప్రయత్నిస్తాడు. అయితే పండుస్వామి పొలాన్నికొనే ప్రయత్నాలన్నింటినీ.. నారప్ప పెద్దకొడుకు మునిఖన్నా (కార్తీక్‌రత్నం) తిప్పికొట్టడమే కాకుండా.. అతనితో గొడవకు దిగుతాడు. దీంతో పండుస్వామి మునిఖన్నాపై పగను పెంచుకొని.. తన మనుషులతో మునిఖన్నాను హత్య చేయిస్తాడు. పెద్దకుమారుడు మరణించినా నారప్ప మాత్రం వారిపై ఘర్షణలకు దిగడు. కానీ నారప్ప భార్య సుందరమ్మ (ప్రియమణి) కొడుకు మరణాన్ని తలచుకొని బాధపడుతుంటే.. ఆమె బాధను చూసి చలించిపోయి చిన్న కుమారుడు సినప్ప (రాఖీ) ఒక అనూహ్యమైన పని చేస్తాడు. సిన్నప్ప చేసిన ఆ పని వల్ల నారప్ప కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? ఆ సమస్యల నుంచి బయటపడానికి నారప్ప ఏం చేశాడు..? నారప్ప గత ఏంటీ? అనేది మిగతా కథ.